Wednesday, November 27, 2019

నిజామా? అబద్దమా ?



రంగాపురం జమీందారుకి తాతముత్తాతలు కూడబెట్టిన ఆస్తి బోలెడంత ఉంది. ఆయనకు పందేలు కాయడమంటే తెగ ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక విచిత్రమైన పందెం కట్టి ఎదుటివాళ్లను ఓడించేవాడు. ఎవరైనా గెలిస్తే మాత్రం వారికి బహుమతులు ఇచ్చేవాడు.
ఓ రోజు జమీందారు ఇంటికి స్నేహితులు వచ్చారు. కాసేపు అంతా సరదాగా మాట్లాడుకున్నారు. అంతలో మిత్రుల్ని ఉద్దేశించి ‘మీలో ఎవరైనా సరే ఒక అబద్ధం చెప్పి అది నిజమని నన్ను నమ్మించగలిగితే పది ఎకరాల భూమి రాసిస్తా. లేని పక్షంలో ఈ ఏడాది మీ పొలంలో పండిన పంటంతా ఇచ్చేయాలి. ఇది షరతు’ అన్నాడు జమీందారు.
చెప్పేది అబద్ధమని ముందే తెలుసు కాబట్టి ఆయన ఎలాగూ నమ్మడు. ప్రయత్నించి విఫలమైతే ఈ ఏడాది పంటా దక్కదు. అవసరమా?’ అనుకుని ఎవరూ మాట్లాడలేదు.
ఇంత చిన్న పందేనికి మీలో ఎవరూ ముందుకు రాలేరా?’ సవాలుగా అన్నాడు జమీందారు.
వారిలో రామయ్య అందుకుని ‘మిత్రమా! నేను ఇప్పుడే ఒక అబద్ధం చెప్పి దాన్ని నిజమని నమ్మించగలను’ అన్నాడు.
ఆలస్యమెందుకు రామయ్యా! ఆ అబద్ధం ఏంటో వెంటనే చెప్పి నన్ను నమ్మించు’ అన్నాడు జమీందారు ఉత్సాహంగా.
అప్పుడు రామయ్య ‘నువ్వు నాకు పదెకరాల భూమిని రాసిస్తున్నావు. ఈ మాట అబద్ధం’ అన్నాడు.
జమీందారు చప్పున ‘ఔను’ అనేశాడు. వెంటనే ఆలోచనలో పడ్డాడు.
రామయ్య చెప్పిన అబద్ధాన్ని తాను నిజమని ఒప్పుకున్నాడు కాబట్టి పందెంలో తను ఓడిపోయినట్టే.
ఒకవేళ మాట మార్చి ‘లేదు’ అంటే భూమిని రాసివ్వాల్సి ఉంటుంది. ఏరకంగా చూసినా తాను రామయ్యకు భూమిని రాసివ్వాల్సిందే!
ఇరకాటంలో పడిపోయిన జమీందారు చివరకు తన ఓటమి ఒప్పుకోక తప్పలేదు.
రామయ్య తెలివితేటల్ని అందరూ మెచ్చుకున్నారు.

   
                       

No comments:

Post a Comment