పందికి పన్నీటి స్నానం
పుష్కర దేశాన్ని ధనుంజయుడు పాలించేవాడు. అప్పటి వరకు ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. ఆ సంగతి తెలిసిన రాణి కుముదినీ దేవి రాజు దగ్గరకు వచ్చి, ఆ పదవిలో మా తమ్ముడు ఉత్తరుడిని నియమించండి’ అని కోరింది. ఉత్తరుడు ఏ పనీపాటా లేకుండా తిరిగే సోమరిపోతు. ఆ విషయం రాజుకు తెలుసు. మీ తమ్ముడు ఈ పదవికి తగినవాడు కాదు. కోశాగార పదవికి గణితశాస్త్రంలో ప్రావీణ్యం అవసరం’ అని భార్య కుముదినితో అన్నాడు రాజు. అలాగైతే మా తమ్ముడికి అవసరమైన విద్యలు నేర్పేందుకు ఓ గురువును ఏర్పాటు చేద్దాం’ అని పట్టుబట్టింది రాణి. రాజు కాదనలేక అతడినే పదవిలో నియమించాడు. ఉత్తరుడికి విద్య నేర్పేందుకు ఒక గురువును నియమించినా ఫలితం లేకపోయింది. ఆరు నెలలైనా ఏమీ నేర్చుకోలేదు సరికదా, గురువు తనకు సరిగా చెప్పడం లేదని ఫిర్యాదు చేశాడు. రాణి చెప్పిన మాటలు విని ఆ గురువును చెరసాలలో వేయించాడు రాజు. రాజుగారి నిర్ణయాన్ని ప్రశ్నించలేక గురువుగారి భార్య కుమిలిపోసాగింది. ఆమె బాధను గమనించిన పద్నాలుగేళ్ల కూతురు నాన్నను ఎలాగైనా విడిపించాలని అనుకుంది. ఓసారి మహారాజు మంత్రితో కలిసి నగర సంచారం చేస్తున్నాడు. ఆ సంగతి తెలిసిన గురువుగారి కూతురు ఓ ఉపాయం ఆలోచించింది. సరిగ్గా రాజుగారు తమ వీధిలోకి వచ్చే సమయానికి ఓ పంది పిల్లను పట్టుకుని దానికి పన్నీటితో స్నానం చేయించసాగింది. ఆ పంది విడిపించుకుని బురదగుంటలోకి వెళ్లిపోతున్నా మళ్లీ పట్టుకుని పన్నీరు పోయసాగింది. రాజు ఆ దృశ్యాన్ని చూసి ఆగాడు. వెంటనే మంత్రి, పంది పిల్లకు స్నానం ఏంటి పాపా?’ అని అడిగాడు. దీన్ని తెల్లగా చేసి కంపు పోగడదామని...’ అంది ఆ పాప. మంత్రి బిగ్గరగా నవ్వి, ఎంత పన్నీరు పోసినా పంది కంపు పోదు. ఇది పిచ్చిపని తెలియదా?’ అన్నాడు. మెదడులో తెలివిలేకపోయినా రాణిగారి తమ్ముడికి విద్య నేర్పించాలను కోవడం కన్నా పిచ్చిపనా? అలా నేర్పలేని గురువును చెరసాలలో వేయడం కన్నా పిచ్చిపనా?’ అని అడిగింది. రాజు, మంత్రి తెల్లబోయారు. వెంటనే ఆ పాప రాజుగారి దగ్గరకి వెళ్లి నమస్కరించి, మహారాజా! మీరు శిక్షించిన గురువు మా నాన్నగారు. ఆయన లేకపోవడం వల్ల మేమంతా పస్తులుంటున్నాం. నేను మాట్లాడింది తప్పయితే నన్ను కూడా శిక్షించండి’ అంది ధైర్యంగా. రాజు వెంటనే తన తప్పు గ్రహించి గురువును విడిపించడమే కాకుండా, కోశాగార పదవి నుంచి అప్పటికప్పుడే ఉత్తరుడిని తప్పించాడు.
No comments:
Post a Comment