Thursday, October 12, 2017

తోలుబొమ్మలాట

తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా షృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.
తోలుబొమ్మల పుట్టుక మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాజాస్థానాల లోని పండితులు తమ ప్రభువులను సంతోష పెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే సృజనాత్మకంగా ఉంటుందని భావించి తోలుబొమ్మలను తయారుచేసి, తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శించేవారు.

తోలుబొమ్మల తయారీ
తోలుబొమ్మల తయారీ చాలా శ్రమతో కూడుకున్న పని. వీటి తయారీకి జింక, లేడి లేదా దుప్పి, మేక ఈ మూడు రకాల జంతువుల తోళ్ళను వాడతారు. తోలుబొమ్మలు తమకు తామే తయారు చేస్తారు. ఈ బొమ్మల తయారీకి జింక, దుప్పి, మేక, మేకపోతు, గొర్రె మొదలైన జంతువుల చర్మాలను వాడతారు. దేవతా విగ్రహాలను జింక, దుప్పి చర్మాలతో చేస్తారు. కానీ ఇప్పుడు ఇవి దొరకనందున మేక చర్మాలను వాడుతున్నారు.

తోలుబొమ్మల ప్రదర్శన
రంగస్థలంపై పొడవాటి గుంజలపై తెల్లటి వస్త్రాన్ని లేదా పంచెను ముందు భాగంలో గట్టిగా లాగి కడతారు. తెర భూమి నుండి నిలువుగా ఉండకుండా కొంచెం ఏటవాలుగా కడతారు. ఈ విధంగా కట్టడం వల్ల బొమ్మలను ఆడించేటప్పుడు బొమ్మలకు కాళ్ళు అడ్డుతగలకుండా ఉంటుంది. తోలుబొమ్మల ప్రతిబింబాలు సరిగ్గా తెరపై పడడానికి తెరలోపలి నుండి పూర్వం కాగడాలు ఉపయోగించేవారు. అయితే విద్యుత్ సౌకర్యం అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ కాంతిని ఇచ్చే విద్యుత్ బల్బులను వాడుతున్నారు.

తోలుబొమ్మలాటలో పాత్రలు
తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు వంటి హస్యపాత్రలు ప్రధానంగా వస్తారు

సూత్రధారుడు
నాటకానికి, సినిమాకు దర్శకునిలాగా తోలుబొమ్మలాటకు సూత్రధారి ప్రధాన బాధ్యత తీసుకొంటాడు. అతను చాలా విషయాలలో ప్రజ్ఞాశాలి కూడా అయిఉంటాడు. మిగిలినవారందరూ అతనిని అనుసరిస్తూ ఉంటారు. సూత్రధారుడు కథను చాలా వివరంగానూ, చాకచక్యంగానూ చెబుతుంటాడు. అవసరమైనంత వరకు అర్థాలను విడమరచి వివరిస్తాడు. పాత్రల ఔచిత్యానుసారం గొంతు మారుస్తుంటాడు. ప్రేక్షకుల ఆదరణను, విసుగును గమనిస్తూ సమయాను కూలంగా మార్పులు చేస్తాడు, ఇతర పాత్రలను ప్రవేశపెడతాడు.

జుట్టుపోలిగాడు, బంగారక్క
ఈ రెండు పాత్రలూ తమ హాస్యం ద్వారా ఇంత పొడవాటి ప్రదర్శనలో ప్రేక్షకులను నవ్విస్తూ నిద్రమత్తు వదలగొడుతూ ఉంటాయి. మధ్యమధ్యలో వారి విసుర్లు, పనులు సమాజంలో దురంతాలను కుళ్ళగిస్తూ ఉంటాయి. ఎక్కువగా బంగారక్క గడసరి పెళ్ళాంగా ఉంటుంది. పోలిగాడితో కయ్యానికి దిగుతుంది, మోటు సరసమాడుతుంది.

అల్లాటప్పగాడు, కేతిగాడు
పోలిగాడు తెరమీదనుండి తప్పుకున్నపుడు అల్లాటప్పగాడు ప్రత్యక్షమై బంగారక్కని ప్రసన్నం చేసుకునే దానికి (లోబరుచుకునే) దానికి ప్రయత్నిస్తుంటాడు. వారిద్దరూ మంచి రసపట్టులో ఉన్నపుడు హఠాత్తుగా కేతిగాడు ఊడిపడతాడు. అన్నిబొమ్మలకంటే కేతిగాని బొమ్మ చిన్నది. పానకంలా పుడకలా తెరపై ఎక్కడో ఒకచోట ప్రత్యక్షమై శృంగారఘట్టంలో ఉన్న అల్లాటప్పగాడిని టకీమని ఒకదెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పగాడు. ఇక కేతిగాడు బంగారప్పను ఏడిపిస్తాడు.

ఇంతటి ఉన్నత ప్రమాణాలతో నిండిన తోలుబొమ్మలాట వంశపారం పర్యంగా వస్తున్న ఒక కళాసంస్కృతి. వేల సంవత్సరాలుగా మౌఖికంగా వస్తూ జానపదుల గుండెల్లో గూడుకట్టుకున్న ఉత్కృష్టమైన కళాప్రక్రియ. రామాయణ, మహాభారత, భాగవత కథ లను అలవోకగా చెప్పే తోలుబొమ్మల కళాకారుల మాతృభాష మరాఠీ అంటే ఆశ్చర్యం కలిగించక మానదు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కళారూపం ఆంధ్రదేశంలో ఒక ప్రముఖ కళా రూపంగా అభివృద్ధిచెంది, తెలుగు సంస్కృతిలో మిళితమై, మన జాతీయ సంపదకే వన్నె తెచ్చింది. ఇంతటి ఉన్నతమైన ఈ కళాప్రక్రియ నేడు అతి కొద్ది బృందాలతో జీవిస్తోంది. తోలుబొమ్మల దీపపుకాంతులు చరమాంకంలో ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ కళకు సంబంధించిన రచనలు, చరిత్ర, తోలుబొమ్మల తయారీ, బొమ్మలను ఆడించే పద్ధతులు, ఇందులో ఇమిడివున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం 'లిపి ' ద్వారా లేకపోవడం దురదృష్టకరం. పాశ్చాత్య దేశాలలో ఉన్న బొమ్మలాట ప్రక్రియకు సంబంధించిన విజ్ఞానం లభ్యమవడం కారణంగా మిగిలిన రాష్ట్రాలలో ఔత్సాహికులు, బృందాలు బొమ్మలాటల మనుగడకు, వ్యాప్తికి విశేష కృషి చేస్తుండగా, తోలుబొమ్మల కృషికి మనం మార్గం వేయలేకపోతున్నాము.