అక్షర’ లక్షల ఆది దేవుడు
శివుడు శివంకరుడు, వశంకరుడు కూడా. తన తకధిమి తాండవ కేళీ లయ విన్యాసాలతో సమస్త చరాచర జగత్తును ఆడించే హృదయాలయ వశుడు శివుడు. విలయ కారకుడుగా విఖ్యాతుడైన పరమేశ్వరుడు, నిజానికి భావ పరంపరా వారధి అయిన భాషకు ఉద్భవ కారకుడు. నటరాజుగా మారిన తాండవ శివుని అభంగ ఢమరుక నాదం నుంచే సకల భాషలకు మూలమైన ధ్వనులు ఉద్భవించాయి. ఆ ధ్వనులే ఉత్పత్తి స్థానం ఆధారంగా వర్ణాలుగా పరివర్తన చెందాయి. ఆ వర్ణాలే లక్షల అక్షర మాలలై, వ్యాకరణాన్ని వరించి భాషలుగా అవతరించాయి. అందుకే ఆదిదేవుడి వలె అక్షరం కూడా అనశ్వరమైనది. అర్థనారీశ్వరమైన ఆది దంపతుల వలె వాగర్థాలు కూడా విడదీయలేనివి. శివరాత్రి సందర్భంగా శివుని ఢమరుకం నుంచి జాలువారిన
వర్ణోత్పత్తి క్రమం...
శ్లో// నృత్తావసానె నటరాజ రాజః
ననాదఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్
ఏతద్విమర్శేత్ శివసూత్రజాలం
నటరాజైన శంకరుడు ఆనందతాండవం తర్వాత తన చేతిలోని ఢమరుకాన్ని 14సార్లు మోగించాడు. అప్పుడు ఈ క్రింద సూచించబడిన ధ్వనులు వెలువడ్డాయి.
1) అ, ఇ, ఉ, ణ్ 2) ఋ, ......(అచ్చు)క్ 3) ఏ, ఓ, ఙ్, 4) ఐ, ఔ, చ్ 5) హ, య, వ, ర, ట్ 6) ల, ణ్ 7) ఞ, మ, ఙ, ణ, న, మ్ 😎 ఝ, భ, ఞ్ 9) ఘ, ఢ, ధ, శ్ 10) జ, బ, గ, డ, ద, శ్ 11) ఖ, ఫ, ఛ, ఠ, థ, చ, ట, త, వ్ 12) క, ప, య్ 13) శ, ష, స, ర్ 14) హ, ల్.
పై ధ్వనుల ఆధారంగా మహర్షులు ప్రస్తుతం మనం వాడుకుంటున్న వర్ణమాలను... అంటే ‘‘అ’’ నుండి ‘‘హ’’ వరకుగల రూపొందించి వాటికి ‘‘అక్షరములు’’ అని నామకరణం చేశారు. ‘క్షరము’ అంటే నశించేది అని అర్థం. క్షరము కానిది కాబట్టి ‘అక్షరము’ (శాశ్వతంగా నిలిచేది) అన్నారు. అలాంటి ధ్వనులను చెవులతో మాత్రమే వినగలం. కళ్లతో చూడటానికి, చేత్తో రాయటానికి తగినవిధంగా ఆ ధ్వనులకు ఒక రూపం కల్పించి ‘అక్షరాలు’ అన్నారు. ఈ అక్షరాలతో పదాలు, పదాలతో వాక్యాలు ఏర్పడి ప్రత్యక్షంగా ఉన్నవారికి, పరోక్షంగా ఉన్న వారికే కాకుండా ఆ తర్వాతి తరాలవారికి కూడా తమ భావాన్ని అందించగల ఒక గొప్ప అవకాశం లభించింది. ఆ లిపి రూపంలో ఉన్న అక్షరాలు కాలక్రమంలో అనేక మార్పులకు లోనయ్యాయి. చివరకు దేవనాగరి లిపిలో, వివిధ ప్రాంతీయ భాషలలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అక్షరాలకు ఈశ్వరానుగ్రహంవల్ల లభించిన ధ్వనులే మూలం. ‘‘తల్లి సమస్త భాషలకు దైవతభాషయ’’ అన్నట్లు అన్ని భాషలలోని అక్షరాల ఉచ్చారణకూ ప్రస్తుతం అక్షర రూపంలో మనం ఉచ్చరిస్తున్న ధ్వనులతోనే అధికశాతం ఉచ్చరించడం సాధ్యమవుతుంది. అందుకే భారతీయ భాషలలో చాలా వరకు, కొన్ని సందర్భాలలో ఇతర భాషలలోకి సంస్కృతం చొచ్చుకుపోగలిగింది. ఆ విధంగా పరమేశ్వరుని అనుగ్రహంతో లభించినవి కాబట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతా సూచకంగా వర్ణమాలను నేర్పేముందు ‘‘ఓం నమశ్శివాయ సిద్ధం నమః’’ అని రాయిస్తారు. ఆ తర్వాతే ‘అ, ఆ’ మొదలైన వర్ణాలను బోధించటం ప్రారంభించారు. తదనంతర కాలంలో అవే ‘ఓనమాలు’గా ప్రసిద్ధమయ్యాయి. అవే ‘అక్షరములు’ (నాశము లేనివి)గా నాటినుంచి నేటిదాకా ఉన్నవి. ‘క్+ష=క్ష త్+ర=త్ర జ్+ఞ=జ్ఞ’ ఇతర సంయుక్తాక్షరాల వంటివేగానీ, స్వతంత్రాక్షరాలు కావు. ఇలాంటి అక్షరాలను ఉచ్చరించడానికి అనువుగా ఉన్న ఈ శరీర భాగానికి ‘‘ఆస్యమ్’’ అని నామకరణము చేశారు. ‘‘ఆస్యంతి ఉచ్చారయంతి వర్ణాన్ అనేన ఇతి ఆస్యమ్’’- అంటే... ‘నోరు’ అని మన మాటల్లో చెప్పుకోవచ్చు. నోటిలో కూడా ఏయే భాగంతో ఏయే అక్షరాలు ఉచ్చరించటం సాధ్యమో కూడా వివరించారు.
మూడు భాగాలు
ఇందులో ‘అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు’ అని మూడు భాగాలున్నాయి. అచ్చుల సహాయం లేకుండా హల్లులను స్వతంత్రంగా పలకటం సాధ్యం కాదు. కాబట్టి హల్లులకు అచ్చులు ప్రాణంవంటివి. అందుకే అచ్చులను ‘ప్రాణులు’ అంటారు. ‘‘అచ్’’ ప్రత్యాహారాంతర్గతమైనవి... అంటే- మొదట చెప్పిన సూత్రాలలో ఒకటో సూత్రము మొదటి అక్షరం ‘‘అ’’. నాలుగోసూత్రము చివరి అక్షరం ‘‘చ్’’. ఈ మధ్యగల అక్షరాలు ‘‘అ, ఇ, ఉ, ఋ, ......, ఏ, ఓ, ఐ, ఔ’’లకు ‘అచ్చులు’ అని పేరుపెట్టారు. అదేవిధంగా ‘‘హల్’’ ప్రత్యాహారాంతర్గతమైనవి... అంటే- ఐదో సూత్రం మొదటి అక్షరం ‘‘హ’’. పద్నాలుగో సూత్రం చివరి అక్షరం ‘‘ల్’’. ఈ మధ్యగల అక్షరాలకు ‘హల్లులు’గా నామకరణం చేశారు. ఇటువంటి అక్షరాలు ఆస్యము (నోటి)లో ఏయే ప్రదేశంలో ఏయే అక్షరాల పుట్టుక జరిగిందో దాన్ని కూడా సవివరంగా తెలిపారు.
1) అ, కు, హ విసర్జనీయానాం కంఠః
2) ఇ, చు, య, శానాంతాలు అని ఇలాంటి సూత్రరూపంలో తెలియజేశారు.
1) అ, క, ఖ, గ, ఘ, ఙ, హ (8) వసర్గలు - - - - - - - - వీటికి కంఠం ఉత్పత్తి స్థానం.
2) ఇ, చ, ఛ, జ, ఝ, ఞ, య, శ - - - - - వీటికి దవడలు (తాలు).
3) ఋ, ట, ఠ, డ, ఢ, ణ, ర, ష - - - - - - - వీటికి మూర్ఘ (నాలుక పైభాగము).
4)...., త, థ, ద, ధ, న, ల, స- - - - - వీటికి దంతాలు.
5) ఉ, ప, ఫ, బ, భ, మ - - - - - - - - వీటికి పెదవులు (ఓష్ఠములు).
6) ఞ, మ, ఙ, ణ, న (ముందు చెప్పిన స్థానాలతోపాటు పాటు (నాసిక).
7) ఏ, ఐ - - - - - - - - కంఠం, దవడలు.
😎 ఓ, ఔ - - - - - - - కంఠం, పెదవులు.
9) వ, - - - - - - - - దంతాలు, పెదవులు.
10) ః ఖ - - - - - - - - జిహ్వమూలం (నాలుక మొదటి భాగము)
11) (0) సున్న
ఆ తర్వాత ‘హ్రస్వాలు, దీర్ఘాలు’ అనే మార్పుతో మరిన్ని అక్షర రూపాలు ఏర్పడ్డాయి. ముందు చెప్పినట్లుగా ఈ అక్షరాలతో పద, వాక్య నిర్మాణం జరిగి మనసులోని భావాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నవారికి తెలిపే అవకాశం ఏర్పడింది.
టి.సుధాకరశర్మ