Saturday, January 4, 2020

తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.



తెలుగు భాషని మన ఇళ్లలోనే వాడటం మానేసాం. ఇప్పుడు బళ్ళలో కూడా... 
ఎప్పుడో కొన్నేళ్ళక్రితం    -నాయని జయశ్రీ రాసిన వ్యాసం....

"డోర్ లాక్ చెయ్యకండి"
నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ?’
ఇందులో ‘కార్’ తప్ప అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
కానీ మనం వాడం. 
ఎందుకు? 
ఇది ఈరోజు నాకు హఠాత్తుగా వచ్చిన ఆలోచన కాదు. 
చాలా రోజుల నుంచీ మనసులో నలుగుతున్న ప్రశ్నే.
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 
తలుపు తాళం వేసుకో, 
గడిపెట్టుకో అనే వాళ్ళం. 
ఇవేకాదు, 
చిన్నతనంలో వినిన, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. 
నిన్నమొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకి నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం?
మన తెలుగులో మాటలు లేవా? 
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి. 
కానీ మనం పలకం. 
వంటింటిని కిచెన్ చేసాం. 
వసారా వరండాగా మారింది. 
ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం. 
మన ఇళ్ళకి చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. 
గెస్ట్‌లే వస్తారు. 
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. 
ఏ లంచో, డిన్నరో చేస్తారు. 
భోజనానికి కూర్చొన్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 
అందులో వడ్డించేవన్నీ రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై, చికెన్, మటన్ వగైరాలే. 
అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, కోడికూర, మాంసం తినండి అంటే ఇంకేమన్నా ఉందా,  
వాళ్ళేమనుకుంటారో అని భయం.
అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసికెళ్ళం. 
బ్యాగ్ పట్టుకుని షాప్‍కి వెళ్తున్నాము. 
అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. 
కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.
ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడని అడిగా. 
ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి? అని ఎదురు ప్రశ్న వేసింది. 
బిత్తరపోవడం నావంతయింది. 
టీవీలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 
వంటా-వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళకి అలవోకగా ఆంగ్లపదాలు పట్టుబడతాయి మరి. 
అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 
టీవీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకి వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 
అది ఏ భాషో మీరే చెప్పండి. 
‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి, 
ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, 
స్టౌవ్ ఆఫ్‍చేసి మసాలాపౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలా సాగుతుంది. 
మరి మన కూరలకి అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?
నిన్న మా పక్కింటాయన వచ్చి 
‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, 
ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ 
అని చెప్పి వెళ్ళాడు. 
మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. 
అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 
అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. 
ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై 
కజిన్స్ అయిపోయారు.
పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. 
స్కూల్‍కే పంపిస్తాం. 
సరే బడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు. 
ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 
మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలని వదిలేస్తున్నాం? 
ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా? 
తెలుగు మాటలు మనకి మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి? 
ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు. 
నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, 
నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 
ఇతరులు అనుకోవాలన్న భావన.
ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. 
\ఒకప్పుడు సంస్కృతం పట్ల ఇదే దృక్పథం అలవరచుకున్న తెలుగు వాళ్ళు 
తూర్పు పడమర మిగిల్చారు 
కానీ ఉత్తరం దక్షిణం మరచిపోయారు. 
ఈ కాలంలో ‘వడ’, ‘తెన్ను’ అంటే ఎవరికి తెలుస్తుంది? 
‘జనని సంస్కృతంబె ఎల్ల భాషలకును’ 
అని భావించిన గొప్పగొప్ప పండితులు 
వారి పాండిత్య ప్రకర్ష కోసం 
తెలుగు మాటలు వదిలేసి సంస్కృతం వాడటం మొదలుపెట్టారు. 
వారి దగ్గర పాఠం వల్లెవేసిన వాళ్ళకి అదే గీర్వాణం వంటబట్టింది. 
అదే వరవడిలో మనకి పగలు మిగిలింది, మావు చీకట్లో కలిసిపోయింది. 
ఉసురుకి ప్రాణం పోయింది. 
ఎడం దూరం అయింది. 
అన్నం తినడం మొదలు పెట్టాక కూడు చద్దిపట్టింది. 
ప్రస్తుతం మనం సంతోష పడాలన్నా, 
బాధ పడాలన్నా, 
ఆఖరికి భయపడాలన్నా 
సంస్కృతంలోనే పడుతున్నాం. 
ఇలా చెబుతూ పోతే వీటికి అంతే లేదు.  
వివిధ జానపద కళారూపాలలో ఉన్న ఆనాటి తెలుగు సాహిత్యం, 
శాసనాలు దేశీయ ఛందస్సు లోనే ఉండేవి. 
తెలుగు కవులు దేశి కవిత్వాన్ని వదిలి మార్గ కవిత బాట పట్టడంతో 
చాప కింద నీరులా భాషలో మార్పు వచ్చింది. 
ఇంత జరిగినా మన పల్లె పట్టుల్లో మాత్రం 
జానపద కళలు నిన్న మొన్నటి వరకు బతికే ఉన్నాయి. 
వారి నోట అచ్చ తెనుగు మాటలే వినిపించేవి. 
ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి. 
ఈ మధ్య ఓ సారి ప్రయాణం మధ్యలో 
ఒక చిన్న పల్లెటూర్లో కారు ఆపి 
ఇక్కడ మంచినీళ్ళ సీసాలు ఎక్కడ అమ్ముతారు బాబూ అని ఒకతన్ని అడిగా. 
అతడు కొంచెం వింతగా నావైపు చూసి, 
మినరల్ వాటర్ బాటిల్సా మేడం? అన్నాడు. 
అవునయ్యా అన్నా. 
అలా చెప్పండి మేడం అర్థం అవుతుంది, 
అని అవి అమ్మే చోటు చూపించాడు. 
మూలమూలలకి విస్తరించిన టివి ప్రసారాలు, 
ఇంటర్నెట్ల ప్రభావం వలన ఈ మార్పు చాల త్వరగా జరుగుతూ ఉంది. 
భాషలో లేని పదాలను 
పరభాషల నుంచి తెచ్చుకొని వాడుకోవడం వల్ల 
ఆ భాష పరిపుష్టమౌతుంది. 
అలాగని వాడుకలో ఉన్నమాటలని వదిలేసి 
పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించిపోతుంది. 
ఇంకా సమయం మించిపోలేదు. 
ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు మాటలు 
అంతరించి పోకుండా ఉండాలంటే 
మనం వీలైనంత వరకు తెలుగు మాటలే వాడాలి. 
బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, 
కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. 
అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, 
అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం. 

                                      - జయశ్రీ నాయని

Friday, January 3, 2020

అటవీస్థలములకరుగుదమా ...


సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు అందిస్తున్నాము.


అటవీస్థలములకరుగుదమా , 

గానం : అద్దేపల్లి లక్ష్మి రాజ్యం గారు

అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా

చింతాపిక్కాలాడుదమా సిరి సిరి నవ్వులు నవ్వుదమా
చింతాపిక్కాలాడుదమా సిరి సిరి నవ్వులు నవ్వుదమా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా

గుంటలు గుంటలు త్రవ్వుదమా చెలి గోళీకాయాలాడుదమా
గుంటలు గుంటలు త్రవ్వుదమా చెలి గోళీకాయాలాడుదమా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా

చెమ్మచెక్కలాడుదామా చెలి చక్కిలిగింతలు పెట్టుదామా
చెమ్మచెక్కలాడుదామా చెలి చక్కిలిగింతలు పెట్టుదామా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా

కోతికొమ్మచ్చిలాడుదామా చెలి కొమ్మల చాటున దాగుదామా
కోతికొమ్మచ్చిలాడుదామా చెలి కొమ్మల చాటున దాగుదామా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా

సన్నాజాజులు కోయుదమా దండలు దండలు గుచ్చుదమా
సన్నాజాజులు కోయుదమా దండలు దండలు గుచ్చుదమా
స్వామి మెడలో వేయుదమా
స్వామి మెడలో వేయుదమా
స్వామి మెడలో వేయుదమా

#gobbemmapatalu #gobbipatalu #villagegobbemmasongs #sankranthi songs

మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి


Monday, December 30, 2019

మంచి సహవాసం, చెడు సహవాసం


ఒక చెట్టు మీద రెండు రామచిలుకలు చక్కగా గూడు కట్టుకుని తమ పిల్లలతో సంతోషం గా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు పొద్దున్నే అమ్మ చిలుక, నాన్న చిలుక ఆహారం కోసం చూస్తూ బైటకి వెళ్లాయి. ఇంతలో ఒక బోయవాడు పిల్ల చిలుకలని దొంగిలించాడు.
అందులో ఒక రామచిలుక వాడినించి ఎలాగో తప్పించుకుని, ఒక ఆశ్రమంలో చెట్టుపై నుంటూ, అక్కడ ఋషులు బోధిస్తున్న చక్కటి మంచి మాటలు వింటూ పెరిగింది. ఇంకొక రామచిలుకని బోయవాడు ఒక పంజరంలో బంధించి ఉంచుకున్నాడు. అది వాడి ఇంటి లోగిలి లో పెరిగింది. అది ఎంతసేపు తిట్లు,చెడ్డ మాటలు వింటూ అదే నేర్చుకుంది.
ఒకనాడు ఒక బాటసారి బోయవాడి ఇంటి దగ్గర చెట్టు కింద పడుకున్నాడు. అది చూసి, రామచిలుక, “ఒరేయ్ మూర్ఖుడా! ఇక్కడెందుకు న్నావురా? నీ నాలుక తెక్కొస్తా!” అంటూ భయపెట్టింది. వాడు గతిలేక అక్కడినించి పారిపోయాడు. ప్రయాణించి, వాడు ఆశ్రమం చేరాడు. అక్కడున్న రామచిలుక, “స్వాగతం బాటసారి. నీ అలుపు తీరేవరకు ఇక్కడ విశ్రమించవచ్చు,” అంటూ తియ్యగా పలికింది.
ఆశ్చర్య పోతూ, బోయవాడు నీలాంటి రామచిలుకని నేను దారిలో కలిసాను కానీ అది మహా కటువుగా మాట్లాడుతోంది అన్నాడు. “ఓహ్, బహుశా అది నా అన్న చిలుక అయ్యిఉంటుంది. నేను సాధువులతో సాంగత్యం చేశాను కనుక నా భాష ఇలా ఉంది. అదే నా అన్న వేటగాడి భాష నేర్చుకుని అలా మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి సాంగత్యం లో ఉంటామో అలాగే తయారవుతాము,” అని అనుకుంది రామచిలుక.
నీతి: మంచి వాడివి కావాలనుకుంటే, మంచి వారి సాంగత్యం లో ఉండాలి.

Wednesday, December 25, 2019

అక్షర’ లక్షల ఆది దేవుడు

అక్షర’ లక్షల ఆది దేవుడు

శివుడు శివంకరుడు, వశంకరుడు కూడా. తన తకధిమి తాండవ కేళీ లయ విన్యాసాలతో సమస్త చరాచర జగత్తును ఆడించే హృదయాలయ వశుడు శివుడు. విలయ కారకుడుగా విఖ్యాతుడైన పరమేశ్వరుడు, నిజానికి భావ పరంపరా వారధి అయిన భాషకు ఉద్భవ కారకుడు. నటరాజుగా మారిన తాండవ శివుని అభంగ ఢమరుక నాదం నుంచే సకల భాషలకు మూలమైన ధ్వనులు ఉద్భవించాయి. ఆ ధ్వనులే ఉత్పత్తి స్థానం ఆధారంగా వర్ణాలుగా పరివర్తన చెందాయి. ఆ వర్ణాలే లక్షల అక్షర మాలలై, వ్యాకరణాన్ని వరించి భాషలుగా అవతరించాయి. అందుకే ఆదిదేవుడి వలె అక్షరం కూడా అనశ్వరమైనది. అర్థనారీశ్వరమైన ఆది దంపతుల వలె వాగర్థాలు కూడా విడదీయలేనివి. శివరాత్రి సందర్భంగా శివుని ఢమరుకం నుంచి జాలువారిన
వర్ణోత్పత్తి క్రమం...
శ్లో// నృత్తావసానె నటరాజ రాజః
ననాదఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్‌
ఏతద్విమర్శేత్‌ శివసూత్రజాలం
నటరాజైన శంకరుడు ఆనందతాండవం తర్వాత తన చేతిలోని ఢమరుకాన్ని 14సార్లు మోగించాడు. అప్పుడు ఈ క్రింద సూచించబడిన ధ్వనులు వెలువడ్డాయి.
1) అ, ఇ, ఉ, ణ్‌ 2) ఋ, ......(అచ్చు)క్‌ 3) ఏ, ఓ, ఙ్‌, 4) ఐ, ఔ, చ్‌ 5) హ, య, వ, ర, ట్‌ 6) ల, ణ్‌ 7) ఞ, మ, ఙ, ణ, న, మ్‌ 😎 ఝ, భ, ఞ్‌ 9) ఘ, ఢ, ధ, శ్‌ 10) జ, బ, గ, డ, ద, శ్‌ 11) ఖ, ఫ, ఛ, ఠ, థ, చ, ట, త, వ్‌ 12) క, ప, య్‌ 13) శ, ష, స, ర్‌ 14) హ, ల్‌.
పై ధ్వనుల ఆధారంగా మహర్షులు ప్రస్తుతం మనం వాడుకుంటున్న వర్ణమాలను... అంటే ‘‘అ’’ నుండి ‘‘హ’’ వరకుగల రూపొందించి వాటికి ‘‘అక్షరములు’’ అని నామకరణం చేశారు. ‘క్షరము’ అంటే నశించేది అని అర్థం. క్షరము కానిది కాబట్టి ‘అక్షరము’ (శాశ్వతంగా నిలిచేది) అన్నారు. అలాంటి ధ్వనులను చెవులతో మాత్రమే వినగలం. కళ్లతో చూడటానికి, చేత్తో రాయటానికి తగినవిధంగా ఆ ధ్వనులకు ఒక రూపం కల్పించి ‘అక్షరాలు’ అన్నారు. ఈ అక్షరాలతో పదాలు, పదాలతో వాక్యాలు ఏర్పడి ప్రత్యక్షంగా ఉన్నవారికి, పరోక్షంగా ఉన్న వారికే కాకుండా ఆ తర్వాతి తరాలవారికి కూడా తమ భావాన్ని అందించగల ఒక గొప్ప అవకాశం లభించింది. ఆ లిపి రూపంలో ఉన్న అక్షరాలు కాలక్రమంలో అనేక మార్పులకు లోనయ్యాయి. చివరకు దేవనాగరి లిపిలో, వివిధ ప్రాంతీయ భాషలలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అక్షరాలకు ఈశ్వరానుగ్రహంవల్ల లభించిన ధ్వనులే మూలం. ‘‘తల్లి సమస్త భాషలకు దైవతభాషయ’’ అన్నట్లు అన్ని భాషలలోని అక్షరాల ఉచ్చారణకూ ప్రస్తుతం అక్షర రూపంలో మనం ఉచ్చరిస్తున్న ధ్వనులతోనే అధికశాతం ఉచ్చరించడం సాధ్యమవుతుంది. అందుకే భారతీయ భాషలలో చాలా వరకు, కొన్ని సందర్భాలలో ఇతర భాషలలోకి సంస్కృతం చొచ్చుకుపోగలిగింది. ఆ విధంగా పరమేశ్వరుని అనుగ్రహంతో లభించినవి కాబట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతా సూచకంగా వర్ణమాలను నేర్పేముందు ‘‘ఓం నమశ్శివాయ సిద్ధం నమః’’ అని రాయిస్తారు. ఆ తర్వాతే ‘అ, ఆ’ మొదలైన వర్ణాలను బోధించటం ప్రారంభించారు. తదనంతర కాలంలో అవే ‘ఓనమాలు’గా ప్రసిద్ధమయ్యాయి. అవే ‘అక్షరములు’ (నాశము లేనివి)గా నాటినుంచి నేటిదాకా ఉన్నవి. ‘క్‌+ష=క్ష త్‌+ర=త్ర జ్‌+ఞ=జ్ఞ’ ఇతర సంయుక్తాక్షరాల వంటివేగానీ, స్వతంత్రాక్షరాలు కావు. ఇలాంటి అక్షరాలను ఉచ్చరించడానికి అనువుగా ఉన్న ఈ శరీర భాగానికి ‘‘ఆస్యమ్‌’’ అని నామకరణము చేశారు. ‘‘ఆస్యంతి ఉచ్చారయంతి వర్ణాన్‌ అనేన ఇతి ఆస్యమ్‌’’- అంటే... ‘నోరు’ అని మన మాటల్లో చెప్పుకోవచ్చు. నోటిలో కూడా ఏయే భాగంతో ఏయే అక్షరాలు ఉచ్చరించటం సాధ్యమో కూడా వివరించారు.
మూడు భాగాలు
ఇందులో ‘అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు’ అని మూడు భాగాలున్నాయి. అచ్చుల సహాయం లేకుండా హల్లులను స్వతంత్రంగా పలకటం సాధ్యం కాదు. కాబట్టి హల్లులకు అచ్చులు ప్రాణంవంటివి. అందుకే అచ్చులను ‘ప్రాణులు’ అంటారు. ‘‘అచ్‌’’ ప్రత్యాహారాంతర్గతమైనవి... అంటే- మొదట చెప్పిన సూత్రాలలో ఒకటో సూత్రము మొదటి అక్షరం ‘‘అ’’. నాలుగోసూత్రము చివరి అక్షరం ‘‘చ్‌’’. ఈ మధ్యగల అక్షరాలు ‘‘అ, ఇ, ఉ, ఋ, ......, ఏ, ఓ, ఐ, ఔ’’లకు ‘అచ్చులు’ అని పేరుపెట్టారు. అదేవిధంగా ‘‘హల్‌’’ ప్రత్యాహారాంతర్గతమైనవి... అంటే- ఐదో సూత్రం మొదటి అక్షరం ‘‘హ’’. పద్నాలుగో సూత్రం చివరి అక్షరం ‘‘ల్‌’’. ఈ మధ్యగల అక్షరాలకు ‘హల్లులు’గా నామకరణం చేశారు. ఇటువంటి అక్షరాలు ఆస్యము (నోటి)లో ఏయే ప్రదేశంలో ఏయే అక్షరాల పుట్టుక జరిగిందో దాన్ని కూడా సవివరంగా తెలిపారు.
1) అ, కు, హ విసర్జనీయానాం కంఠః
2) ఇ, చు, య, శానాంతాలు అని ఇలాంటి సూత్రరూపంలో తెలియజేశారు.
1) అ, క, ఖ, గ, ఘ, ఙ, హ (8) వసర్గలు - - - - - - - - వీటికి కంఠం ఉత్పత్తి స్థానం.
2) ఇ, చ, ఛ, జ, ఝ, ఞ, య, శ - - - - - వీటికి దవడలు (తాలు).
3) ఋ, ట, ఠ, డ, ఢ, ణ, ర, ష - - - - - - - వీటికి మూర్ఘ (నాలుక పైభాగము).
4)...., త, థ, ద, ధ, న, ల, స- - - - - వీటికి దంతాలు.
5) ఉ, ప, ఫ, బ, భ, మ - - - - - - - - వీటికి పెదవులు (ఓష్ఠములు).
6) ఞ, మ, ఙ, ణ, న (ముందు చెప్పిన స్థానాలతోపాటు పాటు (నాసిక).
7) ఏ, ఐ - - - - - - - - కంఠం, దవడలు.
😎 ఓ, ఔ - - - - - - - కంఠం, పెదవులు.
9) వ, - - - - - - - - దంతాలు, పెదవులు.
10) ః ఖ - - - - - - - - జిహ్వమూలం (నాలుక మొదటి భాగము)
11) (0) సున్న
ఆ తర్వాత ‘హ్రస్వాలు, దీర్ఘాలు’ అనే మార్పుతో మరిన్ని అక్షర రూపాలు ఏర్పడ్డాయి. ముందు చెప్పినట్లుగా ఈ అక్షరాలతో పద, వాక్య నిర్మాణం జరిగి మనసులోని భావాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నవారికి తెలిపే అవకాశం ఏర్పడింది.

టి.సుధాకరశర్మ


Wednesday, December 4, 2019

ములక్కాయ ముసలమ్మా

అనగనగా ఒక ఊరిలో ములక్కాయ అంత ముసలమ్మా ఉండేదం . ఆ ముసలమ్మకి చామదుంపన్థా చెను ఉండేదంట. ఆ చేమదుంపన్థా చేనులో వంకాయంత వజ్రం దొరికిందం వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తం వేసిందంటే ఆ తాటికాయంత తాళాన్ని బద్దలుకొట్టి దొండకాయంత దొంగోడు ఎత్తుకుపోయాడంట అయ్యో అనుకున్న ముసలమ్మా పొట్లకాయంత పోలీస్ కి కాకరకాయంత కంప్లైంట్ ఇచ్చిందంట పొట్లకాయంత పోలీస్ లవంగం అంత లాటి పట్టుకుని జీలకరంతా జీపు తో దొండకాయంత దొంగని పట్టుకున్నదంతా వంకాయంత వజ్రాన్ని తీసుకెళ్లి మూలకాయంత ముసలమ్మకి ఇపించాడంట


Image result for vegetables clipart

Tuesday, December 3, 2019

జీవితంలో డబ్బే ముఖ్యము కాదు ( పాత రష్యన్ కథ )


      


ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు..
ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది..
మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం..అది...!!
అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!!

ఇంకో రాగి నాణెం వస్తుంది..

మళ్ళీ రుద్దుతాడు..

మరోటి వస్తుంది..

మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!!

అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది..

ఓ మనిషీ..!
ఇది మాయానాణెం..
దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ..

అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ...!!
అని చెప్తుంది..

అంతే ఆ మనిషి తన ఇంటిలో వున్న నేలమాళిగలోకి వెళ్ళి నాణేన్నిరుద్దటం మొదలు పెడతాడు..
తనను తాను మర్చిపోతాడు.. కుటుంబాన్ని మర్చిపోతాడు..

పిల్లల్ని మర్చిపోతాడు..

ప్రపంచాన్ని మర్చిపోతాడు.

.అలా రుద్దుతునే వుంటాడు..

గుట్టలుగా సంపదను పోగెస్తునే వుంటాడు..!!

ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది..
రాగినాణేన్ని పక్కన పడేసి..బయటికి వస్తాడు..

అతడిని ఎవ్వరూ గుర్తు పట్టరు..

పిల్లలకు పిల్లలు పుట్టి వుంటారు..

కొత్త భవనాలు వెలసి వుంటాయి..

కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి..

స్నేహితులు..

చుట్టాలు..

పుస్తకాలు..

ప్రేమ,పెళ్ళి...

జీవితం ప్రసాదించిన అన్ని సంతోషాలనూ అనుభవిస్తుంటారు..

ఆ మనిషికి ఏడుపు వస్తుంది.

ఇంతకాలం ఇవన్నీ వదిలెసి నేను చేసింది ఏమిటా అని కుప్పకూలుతాడు..!!

ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయానాణెం పట్టుకొని వుంటున్నామా అనిపిస్తుంది...

సంపాదనలో పడి ..

కెరీర్ లో పడి..

కీర్తి కాంక్షలో పడి..

లక్ష్య చేధనలో పడి,

బంగారు నాణెం వంటి జీవితాన్ని..

మకిలి రాగినాణెం లా మార్చుకుంటున్నామా అనిపిస్తుంది..!!

అమ్మ చేతి ముద్ద..

భార్య ప్రేమ..

పిల్లల అల్లారు ముద్దు..

స్నేహితుడి మందలింపు..

ఆత్మీయుడి ఆలింగనం..

ఈ బంగారు నాణేలు మన జేబులో తగినన్ని వుండాలి..

ఈ బంగారు ముచ్చట్లు గుండె అంతా నిండాలి.