Saturday, June 15, 2019

అత్తారింటికి దారేది?



ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా సన్నాటంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది.
యమున నది తీరన్న వున్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది యేడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి, “ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా యేడుస్తోంది” అనుకున్నాడు. యెంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు.
మరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి, “మీలో యెవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా?” అని అడిగారు.
సభికులు తెల్లబోయి, సమధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు.
బీర్బల్ ముందుకొచ్చి, “మహారాజా, ఒక సారి వింటే కాని నేను చెప్పలేను” అని అన్నాడు.
అక్బర్ వెంతనే బీర్బల్ను ఆ రాత్రి అంతహ్పురానికి రమ్మని ఆహ్వానించాడు.
రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమ్నునా నది హోరును విన్నాడు.
విషయమర్ధమయ్యింది.
“మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని, పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఖంతో యేడుస్తోంది.” అని మరునాడు సభలో విశ్లేషించాడు.
సభికలందరూ ఈ విషయం విని బిగపట్టిన ఊపిరి వదిలారు.

Monday, April 30, 2018

స్వభావానికి తగ్గ వృత్తి

ఒక రోజు అక్బర్ మహారాజు తన సభలో, “మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు” అని అన్నారు.

అది బీర్బల్ ఒప్పుకో లేదు. మనిషి వృత్తికీ స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు.

అక్బర్ కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివి తేటలు, మేధస్సు మీద చాలా నమక్కం. కాని, అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా.

అందుకనే మనిషి వృత్తి కి, స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే, అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు.

“సరే, రేపు ఇద్దరం మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేద్దాము, ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చోపిస్తాను!” అని బీర్బల్ ఒప్పుకున్నాడు.

అనుకున్న ప్రకారం మొన్నాడు ఇద్దరూ మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేసారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు.

బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి, మిఠాయిలు అమ్ముకుని అతని దగ్గిరకి వెళ్లి, “మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టు లోంచి ఏమైనా ఇప్పించండి!” అని నాటకం ఆడాడు.

మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు చీదరించుకుని, “ఛీ! ఛీ! ధందా చేసుకునే టైం లో ఈ గోలేంటి! నిన్ను చూసి కొనే వాళ్ళు కూడా రారు! పొ! పొ!” అని చికాకుగా ధుత్కరించాడు.

బీర్బల్ ఊరుకో కొండా, చాలా ఆకలి వేస్తోంది అని బ్రతిమాలాడు.

మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుభండారాలు పెట్టుకుని కూడా ఏ మాత్రం చలించలేదు. సహాయకుల చేత బీర్బల్ ని మెడ బెట్టి కొట్టు బయటకు గెంటించాడు.

బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు.

ఒక బండలు కొట్టే మేస్త్రి కనిపించాడు.

అలాగే మారు వేషంలో ఇద్దరూ ఆ బండలు కొట్టే అతని దగ్గిరకు వెళ్ళారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు.

“అయ్యా! మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా?” అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు.

ఆ మేస్త్రి వెంటనే, “అయ్యో! అలాగా! నాతొ రండి.” అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు కడిగి, ఇంట్లోకి తీసుకుని వెళ్లి, ఉన్న కొంచంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించ మన్నాడు.

అతని భార్య కూడా అలాగే అన్నం, కూర, పచ్చడి, పులుసు, తయారు చేసి, రుచికరమైన భోజనం వడ్డించింది.

భోజనం అయ్యాక, కొంచం సేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు నీడలోకి లాగి అక్బర్, బీర్బల్ కి విసినికర్రలు ఇచ్చాడు.

ఇలా మర్యాదగా అతిథులు లాగా సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్, బీర్బల్ సెలవు తీసుకుంటుంటే, దారిలో తినడానికి కొంత తిను భండారం ఒక మూటలో కట్టి ఇచ్చాడు.

తిరిగి సభకు చేరాకా, బీర్బల్ అక్బర్తో, “ప్రభు! చూసారా! మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు, అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి సఖ్త హృదయము లేదు! మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా?” అని అడిగాడు.

అక్బర్ చిరు నవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నారు.

ఆపదలో వున్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి, అతని కుటుంబానికి బహుమూల్యమైన బహుమతులు పంపించి, కృతజ్ఞత తెలియ చేసుకున్నారు. 


Thursday, December 28, 2017

విష్ణు మహిమ

విష్ణు మహిమ

ఒక రోజు అక్బర్ బీర్బల్ ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు.
“బీర్బల్, నాకొక సందేహముంది, తీరుస్తావా? అలనాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెట్టాడని నేను వేద పురాణాలలో వుందని విన్నాను. యెందుకలా? అక్కడ సేవకులెవరూ లేరా?” అని అక్బర్ బీర్బల్ ని అడిగారు.
బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు, “సమ్రాట్, మీ సందేహం నేను సమయమొచ్చినప్పుడు తీరుస్తాను!”
కొన్ని రోజులు గడిచాయి. బీర్బల్ ఒక పనిమనిషిని పిలిచి ఆమె చేతికొక మైనపు బొమ్మను ఇచ్చాడు. బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది. “ఈ రోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు, ఈ బొమ్మని తీసుకుని నీట్లో పడిపోయినట్టు నటించు, నీకు మంచి బహుమానమిప్పిస్తాను,” అని ఆ పనిమనిషికి చెప్పాడు.
అలాగే పనిమనిషి సాయంత్రం అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే తోట నడిమధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్టు నటించింది. తనతో పాటు ఆ శిశువు బొమ్మకూడ నీళ్ళల్లో పడిపోయింది.
అక్బర్ ఈ దృశ్యం చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్ళల్లోకి దూకి ఆ శిశువు బొమ్మని కాపాడ సాగాడు.
బీర్బల్ మడుగు గట్టున నిలుచుని, “మహారాజా, యెందుకు మీరు నీళ్ళల్లో దూకరు? సేవకులని పురమాయిస్తే సరిపోయేది కదా?” అన్నాడు.
“ఒక శిశువు ప్రాణాపాయ స్థిథిలో కనిపిస్తే మీరు యెలా ముందూ వెనకా చూడకుండా ఆదుకోవాలనుకున్నారో, విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడడానికి వెనకాడలేదు” అని చాలా తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు.


Thursday, November 16, 2017

డబ్బుకు లోకం దాసోహం.!

డబ్బుకు లోకం దాసోహం.!

సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు. ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు. ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు. మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే. అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు. ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది. ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా. మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు. కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది. ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా. ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా. ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు. మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే.

అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు. ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే. మెరుపులా తప్పుకున్నాడు రంగా. పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది. వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ. 'నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో, ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను. నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్‌?' అన్నాడు రాజా చిరాకు పడుతూ. 'నీ దగ్గర దాపరికమెందుకు? నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నా' అన్నాడు రంగా నిజాయితీగా. ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు. ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా. ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి. వారితో కలిసి నడవసాగాడు. రాజా, రంగాల మధ్య పాటలు, కబుర్లు, సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్‌. అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ, ఆలోచనలు వారి కబుర్లు, ఆనందాల్ని ఎలా అణిచేసిందో, 'డబ్బుకు లోకం దాసోహం' అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి.


Wednesday, November 1, 2017

శ్రీ కృష్ణదేవరాయులు కల

500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు. అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు.
ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను” అని రాయులు హామి ఇచ్చారు.
“నా దెగ్గిర నూరు నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు విన్నపించాడు.
శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం యెవరు చేసారు, యెక్కడ చెసారు అని ప్రశ్నించారు.
వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు” అని రాయులు ప్రోత్సహించారు.
“నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడు వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు.”
రాయులకు చాలా కోపం వచ్చింది. “యేమిటీ వెటకారం! కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ.
“క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.
రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయినకు అర్ధమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయిన చాలా అభినందించారు. 


Thursday, October 12, 2017

తోలుబొమ్మలాట

తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా షృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.
తోలుబొమ్మల పుట్టుక మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాజాస్థానాల లోని పండితులు తమ ప్రభువులను సంతోష పెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే సృజనాత్మకంగా ఉంటుందని భావించి తోలుబొమ్మలను తయారుచేసి, తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శించేవారు.

తోలుబొమ్మల తయారీ
తోలుబొమ్మల తయారీ చాలా శ్రమతో కూడుకున్న పని. వీటి తయారీకి జింక, లేడి లేదా దుప్పి, మేక ఈ మూడు రకాల జంతువుల తోళ్ళను వాడతారు. తోలుబొమ్మలు తమకు తామే తయారు చేస్తారు. ఈ బొమ్మల తయారీకి జింక, దుప్పి, మేక, మేకపోతు, గొర్రె మొదలైన జంతువుల చర్మాలను వాడతారు. దేవతా విగ్రహాలను జింక, దుప్పి చర్మాలతో చేస్తారు. కానీ ఇప్పుడు ఇవి దొరకనందున మేక చర్మాలను వాడుతున్నారు.

తోలుబొమ్మల ప్రదర్శన
రంగస్థలంపై పొడవాటి గుంజలపై తెల్లటి వస్త్రాన్ని లేదా పంచెను ముందు భాగంలో గట్టిగా లాగి కడతారు. తెర భూమి నుండి నిలువుగా ఉండకుండా కొంచెం ఏటవాలుగా కడతారు. ఈ విధంగా కట్టడం వల్ల బొమ్మలను ఆడించేటప్పుడు బొమ్మలకు కాళ్ళు అడ్డుతగలకుండా ఉంటుంది. తోలుబొమ్మల ప్రతిబింబాలు సరిగ్గా తెరపై పడడానికి తెరలోపలి నుండి పూర్వం కాగడాలు ఉపయోగించేవారు. అయితే విద్యుత్ సౌకర్యం అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ కాంతిని ఇచ్చే విద్యుత్ బల్బులను వాడుతున్నారు.

తోలుబొమ్మలాటలో పాత్రలు
తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు వంటి హస్యపాత్రలు ప్రధానంగా వస్తారు

సూత్రధారుడు
నాటకానికి, సినిమాకు దర్శకునిలాగా తోలుబొమ్మలాటకు సూత్రధారి ప్రధాన బాధ్యత తీసుకొంటాడు. అతను చాలా విషయాలలో ప్రజ్ఞాశాలి కూడా అయిఉంటాడు. మిగిలినవారందరూ అతనిని అనుసరిస్తూ ఉంటారు. సూత్రధారుడు కథను చాలా వివరంగానూ, చాకచక్యంగానూ చెబుతుంటాడు. అవసరమైనంత వరకు అర్థాలను విడమరచి వివరిస్తాడు. పాత్రల ఔచిత్యానుసారం గొంతు మారుస్తుంటాడు. ప్రేక్షకుల ఆదరణను, విసుగును గమనిస్తూ సమయాను కూలంగా మార్పులు చేస్తాడు, ఇతర పాత్రలను ప్రవేశపెడతాడు.

జుట్టుపోలిగాడు, బంగారక్క
ఈ రెండు పాత్రలూ తమ హాస్యం ద్వారా ఇంత పొడవాటి ప్రదర్శనలో ప్రేక్షకులను నవ్విస్తూ నిద్రమత్తు వదలగొడుతూ ఉంటాయి. మధ్యమధ్యలో వారి విసుర్లు, పనులు సమాజంలో దురంతాలను కుళ్ళగిస్తూ ఉంటాయి. ఎక్కువగా బంగారక్క గడసరి పెళ్ళాంగా ఉంటుంది. పోలిగాడితో కయ్యానికి దిగుతుంది, మోటు సరసమాడుతుంది.

అల్లాటప్పగాడు, కేతిగాడు
పోలిగాడు తెరమీదనుండి తప్పుకున్నపుడు అల్లాటప్పగాడు ప్రత్యక్షమై బంగారక్కని ప్రసన్నం చేసుకునే దానికి (లోబరుచుకునే) దానికి ప్రయత్నిస్తుంటాడు. వారిద్దరూ మంచి రసపట్టులో ఉన్నపుడు హఠాత్తుగా కేతిగాడు ఊడిపడతాడు. అన్నిబొమ్మలకంటే కేతిగాని బొమ్మ చిన్నది. పానకంలా పుడకలా తెరపై ఎక్కడో ఒకచోట ప్రత్యక్షమై శృంగారఘట్టంలో ఉన్న అల్లాటప్పగాడిని టకీమని ఒకదెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పగాడు. ఇక కేతిగాడు బంగారప్పను ఏడిపిస్తాడు.

ఇంతటి ఉన్నత ప్రమాణాలతో నిండిన తోలుబొమ్మలాట వంశపారం పర్యంగా వస్తున్న ఒక కళాసంస్కృతి. వేల సంవత్సరాలుగా మౌఖికంగా వస్తూ జానపదుల గుండెల్లో గూడుకట్టుకున్న ఉత్కృష్టమైన కళాప్రక్రియ. రామాయణ, మహాభారత, భాగవత కథ లను అలవోకగా చెప్పే తోలుబొమ్మల కళాకారుల మాతృభాష మరాఠీ అంటే ఆశ్చర్యం కలిగించక మానదు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కళారూపం ఆంధ్రదేశంలో ఒక ప్రముఖ కళా రూపంగా అభివృద్ధిచెంది, తెలుగు సంస్కృతిలో మిళితమై, మన జాతీయ సంపదకే వన్నె తెచ్చింది. ఇంతటి ఉన్నతమైన ఈ కళాప్రక్రియ నేడు అతి కొద్ది బృందాలతో జీవిస్తోంది. తోలుబొమ్మల దీపపుకాంతులు చరమాంకంలో ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ కళకు సంబంధించిన రచనలు, చరిత్ర, తోలుబొమ్మల తయారీ, బొమ్మలను ఆడించే పద్ధతులు, ఇందులో ఇమిడివున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం 'లిపి ' ద్వారా లేకపోవడం దురదృష్టకరం. పాశ్చాత్య దేశాలలో ఉన్న బొమ్మలాట ప్రక్రియకు సంబంధించిన విజ్ఞానం లభ్యమవడం కారణంగా మిగిలిన రాష్ట్రాలలో ఔత్సాహికులు, బృందాలు బొమ్మలాటల మనుగడకు, వ్యాప్తికి విశేష కృషి చేస్తుండగా, తోలుబొమ్మల కృషికి మనం మార్గం వేయలేకపోతున్నాము. 


Sunday, September 17, 2017

మల్లాది వేంకట కృష్ణమూర్తి చిన్న కధలు - ఆరు రూపాయలు


ఓ ఊళ్ళోరాముడ్ని కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు. అయితే అతను బంగారం పట్టినా మట్టయ్యేది. దాంతో దరిద్రాన్ని అనుభవించేవాడు.
ఓ రోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది.
"రాముడ్ని మన దరిద్రం తీర్చమని ప్రార్ధించరాదూ? ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు".
"పిచ్చిదానా! మనకేం కావాలో ఆయనకు తెలీదా? అందుకు నేనాయనకు సూచనలు ఇవ్వలేను" అని అతను ఒప్పుకోలేదు.
ఆ రాత్రి రాముడు అతనికి కలలో కనబడి చెప్పాడు.
"నీ ఇంట్లోని గూట్లో ఆరు రూపాయలు ఉన్నాయి కదా? అవి తీసుకొని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకి వెళ్ళు. అక్కడ ఆరు రూపాయలకి నీకు ఇష్టమైంది ఏది కనబడితే అది కొను. నీ దరిద్రం తీరుతుంది."
ఉదయం నిద్రలేవగానే తన భార్యకి ఆ కల గురించి చెప్పి, అతను సైకిలు మీద పెద్ద బజారుకి బయలు దేరాడు. ఓ చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరని అడిగాడు. జత పది రూపాయలు. ఇంకొంచెం ముందుకు సాగాడు, వేలంపాట వేసే ఓ హాల్లో బొమ్మలని వేలం వేస్తున్నట్లు బయట బోర్డుని చూసి లోపలకి వెళ్ళాడు. గోడకి ఓ పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి. వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బున్న వాళ్ళు చాలామంది వచ్చారు. అతను వెనక్కి తిరిగిపోతుంటే పిచ్చి గీతాలతో గీసిన ఓ బొమ్మని చూపించి చెప్పారు నిర్వాహకులు.
"దీని పేరు శ్రీ రామచంద్రుడు. దీన్ని గీసింది దీపక్ అనే ఆరేళ్ళ కుర్రాడు. మా పాట అయిదు రూపాయలు."
చిన్న పిల్లవాడు గీసిన ఆ నైపుణ్యం లేని బొమ్మని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అసహానంగా పెద్ద చిత్రకారుడి బొమ్మల వేలంపాట మొదలవడం కోసం వారంతా వేచి చూడసాగారు.
"మొదటిసారి అయిదు రూపాయలు....రెండవసారి..అయిదు రూపాయలు...."
అది రాముడి బొమ్మ అవడంతో, వెంకట్రావు గట్టిగా 'ఆరు రూపాయలు' అని అన్నాడు.
" ఆరు రూపాయలు, ఒకటోసారి..రెండోసారి..."
దాన్ని కొనడానికి అక్కడున్న వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, 'మూడోసారి' అని డబ్బు తీసుకుని ఆ బొమ్మని వేలంపాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చారు. అక్కడున్న వాళ్ళంతా ఆ బొమ్మని కొన్న వెంకట్రావు వంక వింతగా చూసారు.
"వేలంపాట మొత్తం ముగిసింది." అని చెప్పారు నిర్వాహకులు.
'అదేమిటి? ఇంకా గోడకి వేలాడే ఆ అసలు బొమ్మలని వేలం వేయాలిగా?" అడిగారు కొనడానికి వచ్చిన వాళ్ళు.
"ఈ బొమ్మలని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాసాడో వినండి. అకాల మృత్యువువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటగా అయిదు రూపాయలతో వేలం వేయాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటిని ఉచితంగా ఇవ్వాలని రాసాడు. కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు.. ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది. కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలని మీరు ఇతని నుండి కొనుగోలు చేయండి."

ఎవరైనా దేవుణ్ణి కానీ, దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే... అతని విలువకు పది ఇంతల విలువను చేకూర్చడానికి, అవి మీకు సహకారం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి..ఆ ప్రేమని పొందగలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు..